వార్త ముఖ్యాంశాలు
- ఆరోగ్యశ్రీ కార్డిస్తే మందులిచ్చే డాక్టర్లు ఎవరైనా ఉన్నారా?
- ఉన్నారనే చెప్పాలి.
- ఈ తమాషా సంఘటన గురించి అందరితో పంచుకోవాలని రాస్తున్నా.
ఆరోగ్యశ్రీ కార్డిస్తే మందులిచ్చే డాక్టర్లు ఎవరైనా ఉన్నారా?
ఉన్నారనే చెప్పాలి. ఈ తమాషా సంఘటన గురించి అందరితో పంచుకోవాలని రాస్తున్నా. నేను నిన్న (గురువారం) నెల్లూరు పొగతోటలోని డాక్టర్ పెంచల్ రెడ్డి గారి హాస్పిటల్ కి వెళ్లాను. ఒక తమాషా సంఘటన జరిగింది. నేను డాక్టర్ గారి కన్సల్టేషన్ కోసం బయట కూర్చున్న. సర్వేపల్లి కి చెందిన 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు అక్కడికి వచ్చాడు. నాకు డాక్టర్ గారు ఫ్రీగా మందులు ఇస్తానన్నాడని చెప్పాడు. అతని చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆమె ఎగాదిగా చూసింది. ఎప్పుడు అని అడిగింది. అంతకుముందు చెప్పారు లే అన్నాడు. అలా కుదరదయ్య నువ్వు కావాలంటే హాస్పిటల్ లో చేరాలి అంది. అతను ఆస్మా పేషెంట్. చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. డాక్టర్ గారికి చూపించిన ప్రిస్క్రిప్షన్ కార్డు ఉంది. అది పాతది. ఎప్పుడో ఏడాది కిందట చూపించుకున్నది. చీటీ రాయించుకుంటావా? అని అడిగింది. నా దగ్గర డబ్బులు లేవమ్మ అన్నాడు. నువ్వు చూపించుకోకుండా మందులు ఎట్లా ఇస్తారు? అని అడిగింది. ఉచితంగా మందులిస్తామని డాక్టర్ గారు ఎప్పుడు చెప్పారు.? అంతకుముందు చెప్పారని ముక్తసరిగా ముగించాడు. మరి డాక్టర్ గారి ఫీజు. నా దగ్గర డబ్బులుంటేగా? అన్నాడు. నన్ను డాక్టర్ దగ్గరికి పంపించు అన్నాడు. అలా కుదరదని చెప్పింది. నేను ఆశ్చర్యంగా చూస్తున్న. అంతకు ముందు వెయిట్ చేస్తున్న నన్ను డాక్టర్ కన్సల్టేషన్ కి లోపలికి వెళ్ళమని నర్స్ చెప్పింది. నేను లోపలికి వెళ్లి కూర్చున్న. ఈ లోగా అక్కడ ఒక మూగ పేషెంట్, అతని భార్య ఉన్నారు. ఇద్దరూ ఆస్మా పేషెంట్లే. ఆ మూగ వ్యక్తి సైగలు చేస్తున్నాడు. డాక్టర్ గారు సైగలతోనే అడుగుతున్నారు. మధ్యలో ఆయన భార్య మాట్లాడుతోంది. ఇద్దరు చూపించుకున్నారు. ఆ ఇద్దరు కూడా ఫ్రీ కన్సల్టేషన్ అని తెలిసింది. వాళ్లకు మందులు కూడా ఇవ్వమని డాక్టర్ గారు ఫార్మసీ కి ఫోన్ చేసి చెప్పారు. ఆ మొత్తం తన అకౌంట్ కింద వేయమని చెప్పారు. ఈలోగా ఆ పెద్దాయన తోసుకొని లోపలికి వచ్చేసాడు. “అయ్యా నా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది” అన్నాడు. “హాస్పటల్లో చేరుతావా”? అంటే కుదరదు, “నాకు వారం రోజులు మందులు ఇస్తే ఈసారి వచ్చినప్పుడు చేరుతా”నన్నాడు. మీకు అంత నమ్మకం లేకుంటే నా ఆరోగ్యశ్రీ కార్డు మీ దగ్గరే పెట్టుకో డాక్టరు అన్నాడు. ఆ కార్డు నేనేం చేసుకోవాలయ్యా? అన్నారు డాక్టర్ నవ్వుతూ. మరి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి.? నేను పేదవాడిని. నీకు తెలియదా,,? అని ఎదురు ప్రశ్నించాడు. సరే అలా కూర్చో అన్నాడు డాక్టర్. అయినా సరే అతను కూర్చోలేదు. “ముందు నాకు మందులిస్తే వెళతా”నన్నాడు. “సరే మూడు రోజులకి మందులు తీసుకో,” నేను మందులు కౌంటర్ కు ఫోన్ చేస్తాననని డాక్టర్ గారు చెప్పారు. “అది కుదరదు వారం రోజులకి ఇవ్వు” అన్నాడు పేషంట్. “నాకు పీల్చే మందులు కూడా కావాలి” అని డిమాండ్ చేశాడు. “సరే వెళ్ళు నేను ఫోన్ చేస్తాను” అన్నాడు డాక్టర్. నాకు ఆశ్చర్యం కలిగించింది. బయటకొచ్చి అక్కడ స్టాప్ నడిగాను. “ఇక్కడ ఫ్రీగా కూడా చూస్తారా?” అని. “అందరికీ కాదు గాని, కొందరికి మాత్రం డబ్బు లేకుండానే పరీక్షలు కూడా చేయిస్తారు”. “ఉచితంగా చూసి మందులు కూడా ఇచ్చి పంపుతుంటారు”. ఆశ్చర్యపోయా. ఇది ఇలా ఉంటే డాక్టర్ గారి కన్సల్టేషన్ రూమ్ కూడా చాలా సరదాగా అనిపించింది. ఒక పేషెంట్ ను చూస్తుంటే ఇద్దరు లోపల ఉంటారు. వాళ్లతో డాక్టర్ వ్యాధి గురించి అడుగుతూనే, మంచి చెడ్డ మాట్లాడుతుంటారు. అక్కడ కూర్చున్న ఇద్దరు పేషెంట్లు డాక్టర్ గారితో మాట కలుపుతుంటారు. “ఇది నేను ఎక్కడా చూడలా.?” “ఇలాంటిది ఎక్కడ తారసపడాలా?” తమాషాగా అనిపించింది. పోయినసారి నేను వెళ్ళినప్పుడు ఇద్దరు పేషెంట్లు మాట్లాడుతూ “మాకు నయమైంది సారు. హాయిగా ఉన్నాం సారు” అంటూ చెప్పడం విన్నాను. నాకు కూడా విపరీతమైన దగ్గు తగ్గింది. మొత్తానికి డాక్టర్ పెంచల్ రెడ్డి గారి హాస్పిటల్. వెరీ స్పెషల్.