చిన్నారులకు కూరగిన్నెలు, స్పూన్లు విరాళంగా అందజేత
ఆత్మకూరు, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని ఎల్ఆర్ పల్లి 1వ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం రెండో రోజు కార్యక్రమాన్ని కార్యకర్త ఎస్.కె. షకీలా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్ర పరిధిలోని చిన్నారులు, తల్లులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్ర పరిధిలోని లబ్ధిదారులు రాపూరు శ్రీకాంత్ రెడ్డి, స్వప్న దంపతుల కుమారుడు విక్రాంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నాయనమ్మ శశి చిన్నారులకు ఉపయోగపడే కూరగిన్నెలు, స్పూన్లను విరాళంగా అందజేశారు. చిన్నారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామగ్రిని అందించడం పట్ల అంగన్వాడీ కార్యకర్త ఎస్.కె. షకీలా దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ, వారి ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కార్యకర్త ఎస్.కె. షకీలా, ఆయా విజయలను తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నారులను ప్రేమతో, బాధ్యతతో చూసుకుంటున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రాల అభివృద్ధికి తల్లిదండ్రులు, దాతలు సహకరించాలని కోరారు.


