
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును తెలంగాణ కాంగ్రెస్ పూర్తి చేసింది… రెండు స్థానాలకు జాబితాను సిద్ధం చేసిన టీపీసీసీ..దాన్ని అధిష్ఠానానికి పంపించింది. సామాజిక సమీకరణాల వారిగా జాబితాను టీపీసీసీ రూపొందించింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి తుది జాబితాలో ముగ్గురికి చోటు కల్పించింది. ఓసీ, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఒక్కో పేరును అధిష్ఠానానికి టీపీసీసీ పంపించింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సామ రాంమ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లతో కూడిన జాబితాను పంపగా.. ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఏఐసీసీ ఫైనల్ చేయనుంది. అలాగే, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ముగ్గురు పేర్లతో జాబితాను టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ స్థానానికి ఇద్దరు ఓసీ, ఒక బీసీ పేర్లతో జాబితాను రెడీ చేసి అధిష్ఠానానికి పంపించింది. ప్రస్తుత ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, సూర్యాపేటకు చెందిన సర్వోత్తమ్ రెడ్డి, ఓయూకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ పేర్లతో జాబితా రూపొందించింది. ఈ ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం లభించనుంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పేర్లను ప్రకటించక ముందే ఆశావహులతో టీపీసీసీ చీఫ్ భేటీ అవనున్నారు.

