నందిగామ ప్రతినిధి
సర్వీస్ ఇనాం భూములపై సంబంధిత రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని నందిగామ సర్వీస్ ఇనాం రైతువారి పట్టా హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. జీఓ నంబర్ 16/2013ను రద్దు చేసి, అసలైన పట్టాదారులైన భూ బాధితులకు తమ భూములపై సర్వహక్కులు కల్పించాలని కోరింది. అలాగే 1956 ఇనాం అబాలిషన్ చట్టాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
నందిగామ కాకతీయనగర్‌లోని ది క్లవర్ నెస్ట్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కమిటీ గౌరవ అధ్యక్షులు రాటకొండ కోటేశ్వరరావు, అధ్యక్షులు కొత్తా కోటేశ్వరరావు సూచనల మేరకు ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. 2013 సంవత్సరం నుంచి తమ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో భూములను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేయించుకుని, బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా వ్యవసాయ భూములను 60 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్నామని, పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నామని తెలిపారు. తమ పెద్దలు కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన భూములేనని, ఎవరి భూములను ఆక్రమించుకున్నవి కావని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
2019లో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని, అది కేవలం కంటితుడుపు చర్యగా మాత్రమే ఉందని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. సర్వీస్ ఇనాం భూములపై సంబంధిత రైతులకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశానికి నందిగామతో పాటు జగ్గయ్యపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సర్వీస్ ఇనాం భూ బాధితులు హాజరయ్యారు. చింతపల్లి ప్రసాద్, గింజుపల్లి రమేష్, అచ్యుతరామయ్య, జవ్వాజి శ్రీనివాస్, రాయపాటి రమేష్, మండవ పిచ్చయ్య, చంద్రశేఖర్ తదితరులతో పాటు 150 మందికి పైగా బాధిత సభ్యులు పాల్గొన్నారు.
తమ భూముల సమస్యపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వెంటనే దృష్టి సారించి, సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
సర్వీస్ ఇనాం భూ బాధితులందరినీ ఒక కమిటీగా సంఘటితం చేసి, సమస్య పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యాచరణకు బాధిత రైతులు, ప్రజలు సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.


