వరికుంటపాడు:మండలంలోని రామాపురంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న సీఎం పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రామాపురంలో పల్లె పండుగ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి, సంబంధిత నాయకులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చేలా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని బొల్లినేని వెంకట రామారావు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలకమైన ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలతో పాటు రాయలసీమ ప్రాంతానికి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల కల అని, ఆ కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీరు, మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని బొల్లినేని వెంకట రామారావు కోరారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీలో వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, చిన్నచిన్న విభేదాలు ఏవైనా ఉంటే వాటిని పక్కనబెట్టి పార్టీ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. సీఎం పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వరికుంటపాడు మండలంలో టీడీపీ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
అనంతరం సభా ప్రాంగణం, ప్రజల రాకపోకలు, పార్కింగ్, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాకి ప్రసాదరావు, చండ్ర ఉమామహేశ్వరరావు, కామేపల్లి వెంకటరత్నం, బొబ్బూరి వెంగళరావు, పావులూరి రవీంద్రబాబు, భోగినేని శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


