సెప్టెంబర్ 251పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా శుక్రవారం సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియపై గ్రామస్తులు, రైతులతో గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీ సర్వే పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియతో భూముల హద్దులు, హక్కులకు సంబంధించి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. న్యూ వెల్మల్ గ్రామంలో ఇప్పటికే 80 శాతం రీ సర్వే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో రైతులు తప్పనిసరిగా తమ భూముల వద్ద అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. రీ సర్వేకు రైతులు అందిస్తున్న సహకారాన్ని కలెక్టర్ అభినందించారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు రీ సర్వే ద్వారా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే పూర్తయ్యే వరకు అధికారులకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ చర్యలు చేపట్టిన కలెక్టర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ సంతోష్, సర్పంచ్ సాగర్, సంబంధిత అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.



