పలువురికి తీవ్ర గాయాలు.. అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
ఊరేగింపులో వైసీపీ జెండాల ప్రదర్శనపై వివాదం
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట: గణేష్ నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటన అంబాజీపేట మండలం గంగలకుర్రులో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, అంబాజీపేట ఎస్ఐ షేక్ సుభాని సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
స్థానికుల వివరాల ప్రకారం.. గంగలకుర్రు పంచాయతీ పరిధిలోని గుంటమామిడితోటకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. గుంటమామిడితోట నుంచి ఊరేగింపు గంగలకుర్రు గ్రామంలోని రావులమ్మ ఆలయం మీదుగా కాపు సామాజిక వర్గానికి చెందిన గణేష్ ఆలయం వద్దకు చేరుకుంది.
అక్కడ పూజలు నిర్వహించే సమయంలో ఊరేగింపును నిలిపివేసి భారీ శబ్దంతో పాటలు వినిపించడంతో పాటు వైసీపీ జెండాలను ప్రదర్శించడంతో వివాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఊరేగింపును ముందుకు తీసుకెళ్లాలని గణపతి ఆలయ కమిటీ సభ్యులు కోరడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో గంగలకుర్రుకు చెందిన జయను నరసింహమూర్తి, జయను లక్ష్మీనారాయణ, జయను మల్లికార్జునరావు, యాళ్ల వరప్రసాద్, మేడేపల్లి సతీష్, అరిగెల బాలసుబ్రమణ్యం తదితరులకు తల, చేతి వేళ్లు, కాళ్లకు గాయాలైనట్లు సమాచారం. వారిని అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ దీపాల అలంకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కర్రలను పెకలించి తమ వారిపై సుమారు 40 మంది దాడి చేశారని కొందరు స్థానికులు ఆరోపించారు. మరోవైపు గుంటమామిడితోటకు చెందిన పలువురికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Uploaded Video:



