విశాఖపట్నం, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి):
విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ మేయర్ పీఠంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రిజర్వేషన్ల తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో వెలువడాల్సి ఉంది.
జీవీఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో మేయర్ పదవిని ఈ వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రధాన రాజకీయ పార్టీల్లో మేయర్ అభ్యర్థిత్వం కోసం ఇప్పటి నుంచే పలువురు బీసీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. రిజర్వేషన్ ఖరారైతే పార్టీల అభ్యర్థుల ఎంపిక, వార్డు స్థాయి సమీకరణాలు, కూటముల వ్యూహాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.
మరోవైపు జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 98 వార్డులను 120గా ప్రతిపాదించిన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు పది జోనల్ కార్యాలయాల్లోనూ అభ్యంతరాల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
అభ్యంతరాల గడువు ముగిసే నాటికి పది జోన్ల నుంచి 2,162 వినతులు అందినట్లు సమాచారం. వీటిలో 150 వార్డులు చేయాలంటూ 1,532 దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ఈ నెల 14న తుది ముసాయిదా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
వార్డుల సంఖ్య, సరిహద్దులు ఖరారైన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ మరింత కీలకం కానుంది. దీంతో విశాఖ మేయర్ పీఠం ఈసారి ఎవరి వర్గానికి దక్కనుంది? బీసీ జనరల్ రిజర్వేషన్ వస్తే ఆ పీఠాన్ని దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరు? అన్న చర్చ ఇప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది.
రిజర్వేషన్ ఖరారైతే.. విశాఖ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచే అవకాశం కనిపిస్తోంది.


