కడప నగర రాజకీయాల్లో మేయర్ పదవిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రానున్న రాజకీయ సమీకరణాలు, కూటమి పార్టీల మధ్య పొత్తులు, స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మేయర్ అభ్యర్థిత్వంపై వివిధ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన తరఫున ఇందిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.కూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా కడప మేయర్ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డిని బరిలో దింపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయిలో తన పరిచయాలను విస్తరించుకోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా అనుచరులు పేర్కొంటున్నారు.
రాజకీయ కుటుంబ నేపథ్యం, నగరంతో ఉన్న పరిచయాలు, వివిధ వర్గాల ప్రజలతో సాన్నిహిత్యం, బడుగు బలహీన వర్గాలతో సంబంధాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కడప మేయర్ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి బరిలోకి దిగితే కూటమి శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే మేయర్ అభ్యర్థిత్వంపై జనసేన లేదా కూటమి తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.దీంతో వేణుగోపాల్ రెడ్డి పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంది. అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.


