మంథని, సెప్టెంబర్ 09:
పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంథని మండలంలోని ఖాన్సాయిపేట ఎంపీపీఎస్ పాఠశాల, భట్టుపల్లి ఎంపీపీఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, వెంకటాపూర్ ఎంపీపీఎస్ పాఠశాల, మల్లారం ఎంపీపీఎస్ పాఠశాల, ఆరెంద జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, స్వర్ణపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలను బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిపై సంబంధిత అధికారులను, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంథని మండలం వెంకటాపూర్ నుంచి ఆరెంద వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న రహదారిపై ఏర్పడిన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంథని మండలం ఖాన్సాయిపేట ఎంపీపీఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెంకటాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మంజూరైన అదనపు తరగతి గది నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులు కొత్తగా కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థికి కనీసం చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు ఉండేలా బోధన అందించాలని ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదించి, కారణాలను తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పాఠశాలలో నెలకోసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని, విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రులకు వివరించి వారి సహకారం తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి చిన్నారి పట్ల మనం చూపించే శ్రద్ధ మన బోధనలోనూ, విద్యార్థుల అభ్యసనలోనూ స్పష్టంగా కనిపించాలి. ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలి సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపిఓ షబ్బీర్ పాషా, ఏఈ పిఆర్. జగదీశ్,సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



