విశాఖపట్నం, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి)
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతిపాదిత 120 వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సెప్టెంబర్ 5 నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు 10 జోనల్ కార్యాలయాలు, సంబంధిత ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై వివరాలను ప్రదర్శించనున్నారు. అలాగే జీవీఎంసీ అధికారిక వెబ్సైట్లోనూ ముసాయిదా వార్డుల సరిహద్దుల వివరాలను అందుబాటులో ఉంచుతారు. పునర్విభజనపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలకు అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే సెప్టెంబర్ 11లోపు జీవీఎంసీ కమిషనర్‌కు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. 120 వార్డులుగా పునర్విభజన ప్రతిపాదనతో విశాఖ నగర రాజకీయాల్లోనూ ఆసక్తి నెలకొంది. కొత్త వార్డుల సరిహద్దులు, రిజర్వేషన్లు, ఆయా ప్రాంతాల రాజకీయ సమీకరణాలపై ఆశావహులు, రాజకీయ పార్టీల నేతలు ఇప్పటికే దృష్టి సారిస్తున్నారు.



