ఇన్‌స్టా స్టోరీతో కలకలం.. యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులు!
ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోస్టు.. నిమిషాల్లోనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ అధికారులు
టెక్నాలజీ సాయంతో ఆచూకీ గుర్తింపు.. ముచ్చర్ల శివారులో యువకుడిని గుర్తించిన పోలీసులు
ప్రేమ విఫలమై మనస్తాపం చెందినట్లు విచారణలో వెల్లడి.. కుటుంబ సభ్యులకు అప్పగింత
ముచ్చర్ల, సెప్టెంబర్ 4:
ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ యువకుడు స్టోరీ పెట్టడం కలకలం రేపింది. అయితే పోలీసుల సకాలంలో స్పందనతో అతడి ఆచూకీని గుర్తించి, ప్రమాదం నుంచి కాపాడిన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
కొల్లపాడకల్ గ్రామానికి చెందిన చేపంగి కిషోర్ (23), తండ్రి బాలయ్య, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేసినట్లు సాయంత్రం 4:59 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సైబర్ క్రైమ్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి యువకుడి ఆచూకీని గుర్తించారు.
యువకుడు హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సెక్టార్ ఎస్‌ఐ జి. సైదులు ఆధ్వర్యంలోని పెట్రోల్ మొబైల్ సిబ్బంది ముచ్చర్ల గ్రామ శివారులో గాలింపు చేపట్టి యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రమాదకర పరిస్థితి నుంచి యువకుడిని సకాలంలో రక్షించగలిగారు.
విచారణలో కిషోర్ తన స్వగ్రామం మహేశ్వరం మండలం కొల్లపాడకల్ అని, బోనాల పండుగ సందర్భంగా మేనమామ గ్రామమైన ముచ్చర్లకు వచ్చినట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ విఫలమైన కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
అనంతరం యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించి, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని స్థానిక గ్రామస్తులు అభినందించారు.
పోలీసు సిబ్బంది: సెక్టార్ ఎస్‌ఐ జి. సైదులు, పెట్రోల్ మొబైల్ సిబ్బంది A. ప్రశాంత్ (PC-11349), P. శ్రీనివాస్ (HG-2031), P. చంద్రశేఖర్ (HG-1389).




