మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థుల వినతి
పెనగలూరు మండలం ఓబిలి గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల మెరుగుదలకు అడుగులు పడ్డాయి. రూ.1.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు. ఓబిలి సత్రం నుంచి అతిగారిపల్లి శ్రీరాములు కుడి వరకు, ఓబిలి పద్మనాభస్వామి ఆలయం నుంచి అరుంధతివాడ వరకు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రహదారుల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. వర్షాకాలంలో రహదారులు దెబ్బతినడంతో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గడంతో పాటు విద్యార్థులు, రైతులు, కూలీలు, వాహనదారులకు ప్రయోజనం కలగనుంది. భూమిపూజ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా గ్రామస్థులు తమ ప్రాంతాల్లోని మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఓబిలి నుంచి శ్రీబలి గ్రామంలోని పటకట్ట మీదుగా పెద్ద దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. ఓబిలి–టంగుటూరు మధ్య సుమారు కిలోమీటరు మేర లో లెవల్ బ్రిడ్జి నిర్మిస్తే వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఉండవని తెలిపారు. జఠారాంపల్లి ఎగువ ప్రాంతం నుంచి ఓదేప్రవరవల్లి దిగువ ప్రాంతం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరుల సౌకర్యార్థం షాదీఖానా, స్మశానవాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తులను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి విని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



