పున్నమి: ఆగస్టు 5 హయత్ నగర్ మండలం: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ 1 మరియు 2 డిపోల కార్మికుల ఆత్మీయ సమావేశం హయత్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు యం. శంకర్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిపోల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశ్వద్ధామ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్మికుల నమ్మకానికి ఎలాంటి విఘాతం కలగకుండా భవిష్యత్తులోనూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల హక్కులను, ప్రయోజనాలను కాపాడే బాధ్యత తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవని, కార్మికులంతా ఏకమై సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో పనిచేసిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యూనియన్ను మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్మికుల విలీనం, మెరుగైన జీతభతాలు, ఉద్యోగ భద్రత, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు, మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ఉద్యోగాలు మరియు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు పాసైన వారందరికీ ఉద్యోగాలు దక్కేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేసేలా యూనియన్ తరఫున పోరాడుతామని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ 2 డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు బి. రామకృష్ణ, డిపో సెక్రెటరీ జి. ముఖేష్, ఉపాధ్యక్షుడు పాపారావు, చీఫ్ అడ్వైజర్ వెంకటేష్, హయత్ నగర్ 1 డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, సెక్రటరీ నరేష్, ఉపాధ్యక్షుడు మైపాల్, మల్లేష్ మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.




