“అమరావతి చాంపియన్షిప్–2026” ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, ఆగస్టు 3 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి పట్టణంలోని శ్రీ రామారెడ్డి జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో “అమరావతి చాంపియన్షిప్–2026” అండర్–17, అండర్–23 క్రీడా పోటీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైన భాగంగా ఉండాలని అన్నారు. క్రీడలతో చిన్నప్పటి నుంచే శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.
అండర్–17, అండర్–23 విభాగాల్లో సుమారు 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తొలుత జిల్లా స్థాయిలో, అనంతరం రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆగస్టు 29న నిర్వహించే స్పోర్ట్స్ డే సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తారని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోందని, విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.



