ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
మధిర నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువకుడు వేణు కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అత్యంత బాధాకరమని జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు మిర్యాల రామకృష్ణ పేర్కొన్నారు. వేణు కుమార్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ ఘటన ఒక్క వ్యక్తికి సంబంధించిన విషాదం మాత్రమే కాదని, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతలో పెరుగుతున్న నిరాశకు ప్రతిబింబమని అన్నారు.
ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, యువత ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలపై ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి పెండింగ్‌తో పాటు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియామకాల ప్రక్రియకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలని, యువత సహనాన్ని పరీక్షించకుండా ఇచ్చిన హామీల అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.



