ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీ తాగేందుకు వెళ్తుండగా మృత్యువు..
ఆత్మకూరు, జూలై 17 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నాగేంద్రపురానికి చెందిన చలమల సుబ్బారెడ్డి (86) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రతి రోజు మాదిరిగానే తెల్లవారుజామున టీ తాగేందుకు బస్టాండ్‌లోని హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సుబ్బారెడ్డిని సోమశిలకు వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు (నంబర్: AP07 Z 0535) మలుపు తిరుగుతున్న సమయంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బస్టాండ్‌లో ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను సముదాయించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును గుర్తించారు. అనంతరం బస్సు డ్రైవర్ సయ్యద్ కరిముల్లాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్టాండ్‌లో బస్సులు తిరిగే ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, పాదచారుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్థానికులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


