ఆటో రవాణా ఖర్చులకు రూ.50 వేల ఆర్థిక సహాయం – నోటు పుస్తకాల పంపిణీ
ఆత్మకూరు, జూలై 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
విద్యే పేదరికాన్ని రూపుమాపే గొప్ప ఆయుధమనే నమ్మకంతో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామ సమీపంలోని కొట్టాల ఎస్టీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గిరిజన విద్యార్థుల కోసం ఆటో రవాణా ఖర్చులకు రూ.50 వేల నగదు సహాయంతో పాటు ఉచిత నోటు పుస్తకాలను అందజేశారు.కొట్టాల ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడిచి పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఉండటంతో పలువురు విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించిన కంచి పరమేశ్వర రెడ్డి గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల ఆటో రవాణా ఖర్చులను భరిస్తూ వారి విద్యాభ్యాసానికి అండగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాలనీవాసులు డప్పు చప్పుళ్లు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులు ఆయన సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో కంచి పరమేశ్వర రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదానంతో ప్రారంభమైన సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సేవలు నేడు 23కు పైగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని కొనియాడారు.మండల విద్యాశాఖ అధికారి సి.హెచ్. అనంతలక్ష్మి మాట్లాడుతూ గిరిజన సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనకు ట్రస్ట్ అమలు చేస్తున్న “గిరిజన ఆడబిడ్డకు పెండ్లి కానుక” పథకం ఆరు మండలాల్లో విశేష ఫలితాలు ఇస్తోందని ప్రశంసించారు. విద్య, సామాజిక చైతన్యం, సంక్షేమం రంగాల్లో ట్రస్ట్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “సమాజం అభివృద్ధి చెందాలంటే సేవతో పాటు విద్య కూడా అత్యంత అవసరం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపితేనే వారి భవిష్యత్తు బంగారు బాట పడుతుంది” అని అన్నారు.అలాగే పాఠశాలలో మొదటి నుంచి చివరి వరకు అత్యుత్తమ హాజరు నమోదు చేసి ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ.1,000 ప్రోత్సాహక బహుమతిని అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా గిరిజన విద్యార్థులు, గిరిజన పాఠశాలలకు తన సహాయ సహకారాలు నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు.సభ అనంతరం విద్యార్థుల ఆటో రవాణా ఖర్చుల నిమిత్తం రూ.50 వేల చెక్కును విద్యాశాఖ అధికారుల సమక్షంలో అందజేశారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. చిన్నారులను స్వయంగా ఆటోలో ఎక్కించి, భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆటో డ్రైవర్‌కు సూచనలు చేశారు. ఒక తండ్రిలా విద్యార్థుల సంక్షేమంపై చూపిన శ్రద్ధకు కాలనీవాసులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ కంచి పరమేశ్వర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.



