ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా, కల్లూరులో గంజాయి అక్రమ రవాణా, సరఫరాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం తెలిపారు.
అరెస్టైన వారిలో కల్లూరు పట్టణానికి చెందిన షేక్ హబీబ్, బొడ్డు చందు, మణుగూరుకు చెందిన తేజావత్ రమేష్ ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన మూడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీఐ ముత్తులింగం తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో కూడా షేక్ హబీబ్ ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి కల్లూరులో చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కొంతకాలం సాధారణ జీవితం గడిపిన హబీబ్, తిరిగి గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు పేర్కొన్నారు.
ఇటీవల మణుగూరులో తన స్నేహితుడు తేజావత్ రమేష్‌ను కలవడంతో ఇద్దరూ కలిసి గంజాయి సేవించారని, అనంతరం తిరిగి గంజాయి వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. బొడ్డు చందు సహాయంతో గంజాయి సేకరించి, అనంతరం ఒడిశా మల్కనగిరి వెళ్లి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
జులై 13న గంజాయిని తరలిస్తుండగా కల్లూరు మండలంలోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ గంజాయి విలువ కిలోకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు ఉంటుందని చెప్పారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీఐ ముత్తులింగం తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో ఎస్‌ఐ హరిత, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహారావు, లక్ష్మీపతి, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రఫీ, విజయ్, రంగారావులు సహకరించారని సీఐ అభినందించారు.



