కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వేలాది ఫిర్యాదులు పరిష్కారం కోసం ఎదురుచూపులు – భూ సమస్యలే అధికం
ఆసిఫాబాద్, జూలై 12:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం జిల్లా, డివిజనల్, మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నప్పటికీ, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వాటి పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వేల సంఖ్యలో ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలే అధికంగా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజావాణిలో సమర్పించిన అర్జీలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో నమోదు చేసినా ఫిర్యాదుదారుల మొబైల్ నంబర్లను తప్పుగా నమోదు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో తమ ఫిర్యాదు ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం కూడా కష్టంగా మారుతోందని వాపోతున్నారు.
అంతేకాకుండా, ప్రజల సమస్యలను వినడం, పరిష్కార చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాల్సిన కొందరు అధికారులు కార్యాలయాల్లో ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లలోనే గడుపుతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూ సమస్యపై మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నందున, పెండింగ్లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి ఫిర్యాదుకు గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రజలు కోరుతున్నారు



