ఇబ్రహీంపట్నంలో మరోమారు పెట్రోల్ చోరీ.. సీసీ ఫుటేజీలో దొంగ కదలికలు
ఇబ్రహీంపట్నం, జూలై 6 (ప్రతినిధి): ఇబ్రహీంపట్నం పట్టణంలో పెట్రోల్ దొంగల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం భాగ్యనగర్ కాలనీలో జరిగిన పెట్రోల్ చోరీ ఘటన మరవకముందే మరోసారి దొంగతనం చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి మంచాల రోడ్డులోని మహంకాళి నగర్‌లో, లేబర్ ఆఫీస్ ఎదుట ఉన్న ఇంటి బయట పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ను దొంగిలించారు. మరుసటి రోజు వాహనాన్ని వినియోగించే సమయంలో పెట్రోల్ మధ్యలోనే అయిపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.
దీంతో ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, రాత్రి సమయంలో ఓ వ్యక్తి బైక్ వద్దకు వచ్చి పెట్రోల్ దొంగిలించిన దృశ్యాలు రికార్డైనట్లు తెలిసింది.
ఈ ఘటనపై బాధితుడు ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పెట్రోల్ చోరీలు వరుసగా జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇలాంటి దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
– ఆలంపల్లి దుర్గేష్, రిపోర్టర్
Uploaded Video:





