✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం, జూన్ 30: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ-1, బీఎల్‌ఏ-2) సమన్వయంతో పనిచేయాలని ఎస్‌ఐఆర్ రాష్ట్ర కన్వీనర్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ జిల్లా సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని బీఎల్‌ఏ-1, బీఎల్‌ఏ-2ల విధులు, బాధ్యతలు, కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణ వంటి ప్రక్రియల్లో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బీఎల్‌వోలతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
సమావేశంలో గోదావరి జోన్ ఎస్‌ఐఆర్ కన్వీనర్ శ్రీమతి మాలతి రాణి, తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జిల్లా ఎస్‌ఐఆర్ కన్వీనర్ రేలంగి శ్రీదేవి, జిల్లా బీఎల్‌ఏ-1లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



