నెల్లూరు: బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర మంత్రి నారాయణ పరిస్థితిని సమీక్షించి, నిఘా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఊహకు మించి భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు పండుగకు హాజరవుతున్నారని చెప్పారు.
కార్పొరేషన్, పోలీసు శాఖలు ప్రత్యేక సిబ్బందిని నియమించి నిర్వహణ, భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దర్గా అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేసిందన్నారు.
చిన్నపిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక గుర్తింపు ట్యాగ్లు ఏర్పాటు చేస్తున్నామని, తప్పిపోయిన పిల్లలను వెంటనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. రొట్టెల పండుగలో అన్నదానం, అభివృద్ధికి దాతలు సహకరించడం అభినందనీయమని పేర్కొంటూ, ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించిన అధికారులను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ అజితా వేజెండ్ల, ఏఎస్పీ దీక్ష, మేయర్ సుజాత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


