– అనంతసాగరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టుకూరు కృష్ణారెడ్డి
“సోమశిలకు వెళ్లి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు… ఫొటోలు దిగారు… కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి మాత్రం మీ కళ్లకు కనిపించలేదా? లేక చూడాలనే మనసే లేదా?” అని అనంతసాగరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టుకూరు కృష్ణారెడ్డి ప్రశ్నించారు.
సోమశిల గ్రామాన్ని, సోమేశ్వరస్వామి ఆలయాన్ని వరదల బారి నుంచి శాశ్వతంగా రక్షించేందుకు నిర్మిస్తున్న సేఫ్టీ వాల్ కనిపించలేదా? పునర్నిర్మాణం జరుగుతున్న ఆలయం కనిపించలేదా? ప్రాజెక్టు వద్ద యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న మరమ్మత్తు పనులు కనిపించలేదా? ఇవన్నీ చూసి కూడా చూడనట్లు మాట్లాడడం దురదృష్టకరం.
మీ పాలనలో ప్రాజెక్టు నిర్వహణ ఏ స్థితికి చేరిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గేట్లకు కనీస నిర్వహణ లేక, మరమ్మత్తులు లేక నిర్లక్ష్యానికి గురైన పరిస్థితిని ప్రజలు మరచిపోలేదు. అదే పరిస్థితిని మార్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే గేట్ల మరమ్మత్తులు చేపట్టి, ప్రాజెక్టు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నేడు ప్రజల ముందుంది.
సోమేశ్వరస్వామి ఆలయం వరదల్లో కొట్టుకుపోయ్యి ప్రమాదంలో ఉన్నప్పుడు మీకు ఒక్కసారైనా బాధ కలిగిందా? ఆ ఆలయాన్ని, ఆ గ్రామాన్ని కాపాడాలనే ఆలోచన మీకు వచ్చిందా? భక్తుల విశ్వాసం, ఆ ప్రాంత ప్రజల మనోభావాలు గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
ఈ రోజు ప్రభుత్వం ఆలయ పరిరక్షణ కోసం చేపడుతున్న పనులు… భక్తుల సౌకర్యాల కోసం చేపడుతున్న కార్యక్రమాలు… ప్రాజెక్టు భద్రత కోసం అమలు చేస్తున్న చర్యలు… ఇవన్నీ పక్కనపెట్టి కేవలం విమర్శలతో రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారు.
సోమశిల అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు… లక్షలాది మంది రైతుల జీవనాధారం…వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని రాజకీయ ఆరోపణలకు వేదికగా మార్చడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే.
గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి . రాష్ట్రంలోనే అత్యధిక నిధులను తీసుకువచ్చి రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, దేవాలయాల అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో ఆత్మకూరును అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు.
అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం కంటే, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం వైఎస్సార్సీపీ నాయకులకు ఉంది.
ప్రజలు ఇప్పుడు మాటలను కాదు… పనులను చూస్తున్నారు. ఆరోపణలను కాదు… అభివృద్ధిని కొలుస్తున్నారు. విమర్శలు చేసే వారిని కాదు… ప్రజల కోసం పనిచేసే నాయకులనే గుండెల్లో పెట్టుకుంటున్నారు.
ఇప్పటికైనా విమర్శల రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఆత్మవిమర్శ చేసుకోండి. సోమశిలకు వెళ్లిన ప్రతిసారి అభివృద్ధిని కూడా చూడండి… అప్పుడే ప్రజలకు నిజం తెలుస్తుంది.

