ప్రాజెక్ట్ పునఃప్రారంభం వరకు పోరాటం కొనసాగిస్తాం: మేకపాటి విక్రమ్ రెడ్డి
సోమశిల సందర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయడం వల్ల నెల్లూరు జిల్లాకు దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని, ప్రాజెక్ట్ పునఃప్రారంభం అయ్యే వరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనలో భాగంగా గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలతో కలిసి సోమశిల జలాశయాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను సోమశిలకు తరలిస్తే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలతో పాటు కావలి, వెంకటగిరి ప్రాంతాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందన్నారు. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రాజెక్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా లభిస్తుందని అన్నారు. గతంలో కేటాయించిన నిధులతో పనులు ముందుకు సాగాయని, ప్రస్తుతం వాటిని నిలిపివేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.నీటి వనరుల వినియోగంలో ముందుచూపు అవసరమని, వాతావరణ మార్పులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని పేర్కొన్న మేకపాటి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ప్రజలతో కలిసి మరింత బలమైన ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్ ఆనం జయకుమార్ రెడ్డి, కావలి ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వెంకటగిరి ఇన్‌చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట ఇన్‌చార్జ్ కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.


