*లక్షలు వెచ్చించి కట్టిన సెగ్రిగేషన్ షెడ్డు శిథిలావస్థలో… అధికారుల నిర్లక్ష్యంతో నిధుల వృధా*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 09
గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ఏన్కూరు మండలంలోని లచ్చగూడెం గ్రామపంచాయతీకి సంబంధించి
ప్రభుత్వం పారిశుధ్యం, చెత్త వేర్పాటు కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు ఇప్పుడు నిరుపయోగంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రజాధనం నీటిపాలైంది.
లచ్చగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త వేర్పాటు, డంపింగ్ యార్డ్ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. షెడ్డుపై “డంపింగ్ యార్డ్” అని పెయింట్ కూడా కొట్టారు. నిర్మాణానికి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
కానీ ప్రస్తుతం షెడ్డు పరిస్థితి దయనీయంగా ఉంది. షెడ్డు పైకప్పు షీట్లు విరిగిపోయి వేలాడుతున్నాయి. స్తంభాలు బోసిపోయి, కిందంతా గడ్డి, ముళ్ల పొదలు పెరిగాయి. చెత్త వేర్పాటు చేయాల్సిన ప్రదేశంలో ఇప్పుడు ఒక్క చెత్త పోగు కూడా కనిపించడం లేదు. నిర్మించిన కొద్ది రోజులకే ఇలా నిరుపయోగంగా మారడం స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.
*అధికారుల పర్యవేక్షణ శూన్యం*
షెడ్డు నిర్మాణం తర్వాత ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాళాలు వేసి మరిచిపోయినట్లుగా ఉంది. ఫలితంగా ప్రజాధనం వృధా అయింది. ఈ షెడ్డును ఉపయోగించుకుంటే గ్రామంలో చెత్త సరిగా వేరు చేసి, పారిశుధ్యం మెరుగుపడేదని గ్రామస్తులు అంటున్నారు.
స్థానికులు మాట్లాడుతూ, “లక్షలు పెట్టి కట్టిన షెడ్డు ఇలా పాడైపోవడం బాధాకరం. వెంటనే అధికారులు స్పందించి షెడ్డును బాగు చేయించి, ఉపయోగంలోకి తీసుకురావాలి. లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.
స్వచ్ఛ భారత్ నిధులతో నిర్మించిన ఈ షెడ్డుపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



