ఆత్మకూరు, జూన్ 5 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):
జూన్ నెల మలేరియా నివారణ మాసోత్సవాల సందర్భంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం శుక్రవారం ఆత్మకూరులో విస్తృత పర్యటన నిర్వహించి వివిధ వైద్య, ఆరోగ్య సంస్థలను సందర్శించారు. మలేరియా, డెంగ్యూ తదితర కీటక జనిత వ్యాధుల నివారణకు చేపడుతున్న చర్యలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.మొదటగా ఆత్మకూరులోని జిల్లా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా మలేరియా అధికారి అక్కడి ఎస్ఎస్‌హెచ్ ల్యాబ్‌ను పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్లతో మాట్లాడి వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ, నమూనాల సేకరణ, నివేదికల నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. ల్యాబ్ రికార్డులను పరిశీలించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సమావేశమై ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు, వ్యాధుల నిర్ధారణ విధానాలు, వర్షాకాలంలో వ్యాధుల పర్యవేక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
తదుపరి ఆత్మకూరు యూఎల్‌బీ సబ్ యూనిట్ అధికారి ఎస్. సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోకల్ స్ప్రే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆల్ఫా సైఫోమెత్రిన్ 5 శాతం మందుతో చేపడుతున్న స్ప్రేయింగ్ విధానాన్ని పరిశీలించి దోమల నిర్మూలన చర్యలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు.అనంతరం ఆత్మకూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్‌ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న ఫోకల్ స్ప్రే కార్యక్రమాన్ని పరిశీలించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
తదుపరి అరుంధతివాడ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ల్యాబరేటరీని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి వ్యాధుల పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు వర్షాకాలంలో ప్రబలే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ (జేఈ), ఫైలేరియా, కాలాజార్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.మలేరియా నివారణ మాసోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కీటక జనిత వ్యాధుల నివారణపై నినాదాలు చేశారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి మలేరియా నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి ఓ. జయరామ్, యూఎల్‌బీ ఎస్‌యూఓ ఎస్. సుధాకర్, హెచ్‌వీ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ రవీంద్రారెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


