దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో ఇది మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం. శనివారం లీటరుకు సగటున 90 పైసల వరకు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.100 మార్క్‌కు చేరువ కాగా, కోల్‌కతాలో పెట్రోల్ లీటరు ధర రూ.110 దాటింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల భారతీయ చమురు మార్కెటింగ్ సంస్థలపై ఒత్తిడి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో సిఎన్‌జీ ధరలు కూడా కిలోకు రూపాయి మేర పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.115 దాటడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రవాణా, సరుకు రవాణా మరియు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.


