భక్తి భావంతో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణం – నూతన దంపతులకు దైవ ఆశీస్సులే లక్ష్యం
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రాతినిధి)
ఆత్మకూరు నిత్యాన్నదాత, శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న K.P.R కంచి పరమేశ్వర రెడ్డి కళ్యాణ మండపం నందు బుధవారంనాడు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో, వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. పండితుల ఆశీర్వాదాలతో ఆలయ నిర్మాణ పనులకు పునాది వేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం ప్రారంభం కావడంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమాల సమయంలో గణపతి నామస్మరణతో భక్తులు భక్తి భావంలో మునిగిపోయారు.ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నాను. ముఖ్యంగా K.P.R కళ్యాణ మండపంలో వివాహం చేసుకునే నూతన దంపతులకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సంకల్పించాను” అని తెలిపారు.అలాగే భవిష్యత్తులో ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేసి ఆతిథ్యాన్ని అందించారు.

