కుప్పురుపాడులో వైభవంగా శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట
కార్యక్రమంలో పాల్గొన్న నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్.పేట మండలం కుప్పురుపాడు ఎస్సీ కాలనీలో సోమవారం నూతనంగా నిర్మించిన శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
భక్తుల సౌకర్యార్థం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా ఆయన సహకారం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై చర్చించి, భవిష్యత్తులో కూడా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తమ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నించి, అడగ్గానే అన్నప్రసాద వితరణకు అండగా నిలిచిన పరమేశ్వర రెడ్డి ని కాలనీవాసులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, “శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు మరెన్నో విజయవంతంగా కొనసాగాలని, శ్రీరాముని దీవెనలతో పరమేశ్వర రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని తెలిపారు.శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు .


