-నోటీసులు లేకుండా రీ-సర్వే నిర్వహణపై రైతుల ఆగ్రహం
-జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు – చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
-పారదర్శక దర్యాప్తు, అధికారిపై చర్యలకు డిమాండ్
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం లో ఈడిగపల్లి గ్రామంలో భూవివాదం మరింత వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్ 1609/9A1కు సంబంధించిన భూమిపై గౌరవ హైకోర్టు స్టేటస్ క్వో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, సంబంధిత వీఆర్వో భుజంగ రావు ఏప్రిల్ 9, 2026న రీ-సర్వే నిర్వహించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ చర్య కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా భావిస్తూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పొన్నా లక్ష్మీదేవి, ఆమె కుటుంబం ఈ భూమిపై వివాదం నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టేటస్ క్వో కొనసాగించాలని ఆదేశించింది. ఈ విషయం అధికారులకు తెలిసి ఉండగానే, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రీ-సర్వే నిర్వహించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ సర్వే పక్క భూమి యజమాని కొల్లపనేని జయప్రకాశ్‌కు అనుకూలంగా జరిగిందని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించిన బాధితులు, రీ-సర్వేను తక్షణమే రద్దు చేయాలని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసి పారదర్శకంగా మళ్లీ సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, వీఆర్వోను బాధ్యతల నుంచి తప్పించి, పారదర్శకంగా పనిచేసే ఇతర అధికారిని నియమించాలని కూడా డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




