గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఎటువంటి రాజీ లేకుండా టెక్నికల్ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఫిల్లర్లు నాలుగు మీటర్ల లోతులో వేసి, ఫౌండేషన్‌ను లేయర్ బై లేయర్ సాండ్, గ్రావెల్‌తో బలంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల సమన్వయంతో విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
రివర్ ఫ్రంట్ పనుల బలాన్ని మరింత నిర్ధారించేందుకు ఇరిగేషన్ శాఖ ద్వారా సర్టిఫికేషన్ తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గత వరదలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ నియంత్రణకు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తామని, ప్రతి ఘాట్‌కు సామర్థ్య పరిమితి నిర్ణయించి అవసరమైతే భక్తులను ఇతర ఘాట్లకు మళ్లించే విధానం అమలు చేస్తామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు.
భక్తుల భద్రత దృష్ట్యా పుష్కరాల రేవులో జారిపడకుండా టైల్‌లపై గ్రూవ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఘటనలను పరిగణనలోకి తీసుకుని భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
వర్షాకాలానికి ముందు నగరంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మేజర్ డ్రైన్స్ డీ-సిల్టింగ్‌తో పాటు బాటిల్‌నెక్స్ తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైటెక్ బస్ స్టాండ్ వద్ద రూ.3.7 కోట్లతో మేజర్ డ్రైన్ పనులు ప్రారంభిస్తున్నామని, వీటితో ఆ ప్రాంతంలో నీట మునిగే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. అలాగే విఎల్పురం, తిలక్ రోడ్, డీమార్ట్ వెనుక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రతి ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని, పుష్కరాల కంటే ముందే అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్స్ నిర్వహిస్తూ పనులపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు.
నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, మేజర్, మైనర్ డ్రైనేజీలలో డీ-సిల్టింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో ఇంజనీరింగ్ మార్పులు, అవసరమైన చోట వెంట్ల విస్తరణ చేపడతామని చెప్పారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే, మే 31లోగా అన్ని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ రేస్ నేపథ్యంలో నగరానికి భారీగా ప్రజలు వచ్చే అవకాశముండటంతో శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం అత్యవసరమన్నారు.
నల్లా ఛానల్ వద్ద డబుల్ లైన్ సిస్టమ్ ప్రతిపాదనపై చర్చించి, ప్రస్తుత స్థితి, పనుల పురోగతి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటర్ పంపులు సిద్ధం చేయడం, మోటార్ క్లీనింగ్ కోసం అదనపు యంత్రాల కొనుగోలు, ఫీల్డ్ సిబ్బందికి ప్రత్యేక బాధ్యతల కేటాయింపు వంటి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు.


