అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాపూరు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. రాపూరు–చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి సమీపంలో ప్రేమికులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతులను ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి (24)గా పోలీసులు గుర్తించారు.
-సోషల్ మీడియా పరిచయం.. విషాద ముగింపు:
పోలీసుల కథనం మేరకు.. ప్రసన్న, సావిత్రిలకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం కుటుంబాల్లో చిచ్చు పెట్టిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరూ అటవీ ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
-విషం తాగి.. ఆపై ఉరివేసుకుని.
ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రేమికులు మొదట విషం తాగి, ఆపై చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో మృతదేహాలను గమనించిన పంగిలి గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
-కేసు నమోదు:
సమాచారం అందుకున్న రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. వివాహిత అయిన సావిత్రి తన ఇద్దరు పిల్లలను వదిలి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


