ఏయూ సిఈ పూర్వవిద్యార్థుల సమావేశం 7న
– రూ 4.5 కోట్లతో హాస్టల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు
*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- *
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిశంబరు 7 వ తేదీన డా॥ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం గం. 9.00 ని॥ లకు నిర్వహిస్తున్నట్లు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్యక్షులు ఐ.వి.ఎన్.ఎస్.కె విశ్వనాథ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా పట్టభద్రులైన పూర్వ విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వవిద్యార్థులు తమ ప్రయాణాన్ని, ప్రగతిని, అనుభవాలను, అనుభూతులను ఈ సందస్భంగా పంచుకుంటారు.
కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు నగదు పురస్కారం వారి తల్లిదండ్రులకు సత్కారం చేయడం జరుగుతుందని తెలిపారు.
సమావేశం అనంతరం పూర్వ విద్యార్థుల సంఘంచే నిర్మింపబడిన సర్ ఎం.విశ్వేశ్వరయ్య హాస్టక్ బ్లాక్‌ను ఆసక్తి గల సభ్యులు సందర్శిస్తారు. ఈ హాస్టల్ భవనాన్ని రూ 4.5 కోట్ల వ్యయంతో పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులు స్వయంగా నిర్మించి వర్సిటీకి బహూకరించడం జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులంతా అందించిన విరాళాలతో ఈ హాస్టల్ భవన సముదాయం నిర్మాణం జరిపాము.
విశాఖ నగరం పరిసర ప్రాంతాలలో ఉన్న పూర్వవిద్యార్థులంతా ఈ నెల 7వ తేదీ ఆదివారం జరిగే పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరు కావాలని పూర్వవిద్యార్థుల సంఘం తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శతాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న తరుణంగా ఈ సమావేశం ఒక మధుర అనుభూతిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము.
కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్కర రావు, ఉపాధ్యక్షులు ఎం.జి మాధవ బాబు, సీనియర్ సభ్యులు వి.ఆర్ రావు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


