పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
తేది 27-11-2025
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి: డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి
హైదరాబాద్: నవంబర్ 27 :
రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం నాడు డిజిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ కమిషనరేట్ మినహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మొదలుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ… పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిస్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని,ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో శాంతి భద్రతల అదనపు డిజిపి శ్రీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్ 2 అడిషనల్ డిజిపి శ్రీ డి.ఎస్. చౌహాన్, మల్టి జోన్ 1 ఐ.జి.పి. శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ శ్రీ రమణ కుమార్, లీగల్ అడ్వైజర్ శ్రీ ఇ. రాములు తదితరులు పాల్గొన్నారు.


