*
ప్రధాన మంతి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ఫకీరుగూడెంలోని కమ్యూనిటీ హాలు పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలులో చేసిన సంస్కరణల ద్వారా ప్రజలకు జరిగే ప్రయోజనాల గురించి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్థానికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం వల్ల దేశంలోని ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజల సంపాదించిన సొమ్ము ఆదా అవుతోందని చెప్పారు. తద్వారా ప్రజల్లో అటు కొనుగోలు శక్తి, ఇటు పొదుపు పెరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. జీఎస్టీలో సంస్కరణలు అమలు చేయడం వల్ల కలుగుతున్న లబ్ధిని కూటమి పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి చక్కగా వివరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అంటేనే ప్రజా సంక్షేమం, అభివృద్థి, వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వాటిల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం అని చెప్పారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారని, ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పుడు పేదలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీ–4 పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు పేద కుటుంబాలకు అండగా ఉండటమే పీ–4 పథకం అని చెప్పారు. మన రాష్ట్రంలోని వారితో పాటుగా విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ పీ–4 లో స్వచ్ఛందంగా వచ్చి భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ డివిజన్‌లో కాలువ గట్ల వెంట ఉన్న ఖాళీస్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి క్రీమికీటకాలు, పాములు, కొండ చిలువలు ఇంటి పరిసరాల్లో వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించడానికి డివిజన్‌లో పనిచేస్తున్న సుమారు వంద మంది పారిశుద్ధ్య కార్మికులతో ఈ ఖాళీస్థలాలను శుభ్రం చేయించే కార్యక్రమాన్ని నిర్వస్తామని తెలిపారు. ఈ డివిజన్‌లో పనులు పూర్తి అయిన తర్వాత మరో డివిజన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజలకు ఉపయోగపడే వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి వారిని భాగస్వాములను చేయడం అని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
పార్టీ డివిజన్ అధ్యక్షుడు భాగం సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఫకీరూగూడెం ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారన్నారు. అండర్ పాస్ దగ్గర ఉన్న సమస్యతో పాటుగా కాలువగట్లపై ఉన్న చెట్లను తొలగించాల్సిందిగా స్థానికులు కోరారని, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తక్షణమే స్పందించి కార్పోరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులతో మాట్లాడారని చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో కాలువ గట్లపై చెట్లు తొలగించే పనులు మొదలు పెడతామని అధికారులు చెప్పారన్నారు. ఒక కార్మికుడి మాదిరిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నియోజకవర్గ అభివృద్థికి పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను ఆదర్శంగా తీసుకుని డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఫిరోజ్, మహమ్మద్ ఖలీల్, దున్నా ఏసురత్నం, పిడతల కోటి, కంచర్ల శ్రీను, పరిశపోగు విజయ్, ఎస్.కె.కలాం, దూపాటి శాంతకుమారి, కోలుకొండ నాని, ఎండీ.హుస్సేన్, నామాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


