101 జయంతి సందర్బంగా మధురవాడలో ఘనంగా నివాళులు.

సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కామ్రేడ్ ఎ బి బర్ధన్ (92) గొప్ప నిబద్దత కలిగిన నాయకుడని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు నివాళులు అర్పించారు.
గురువారం కామ్రేడ్ ఎ బి బర్ధన్ 101 వ జయంతిని మధురవాడ సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ 1924 సెప్టెంబరు 25 వ తేదీన జన్మించిన బర్ధన్ 2016 జనవరి 02 వ తేదీన మరణించారని కార్మిక నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించిన బర్ధన్ 20 సార్లు అరెస్టయ్యారని, నాలుగేళ్లకుపైగా జైలు జీవితం గడిపారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారని, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి అధ్యక్షునిగా పనిచేశారని, 1990లో దేశ రాజకీయాలలో ప్రవేశించి సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా 1996లో యూపీఏ1 సంకీర్ణ ప్రభుత్వంలో సీపీఐ చేరడంలో బర్ధన్ కీలక పాత్ర పోషించి, పనికి ఆహార పథకం, సమాచార చట్టం రూపకల్పనకు విశేష కృషి చేశారని, అప్పటివరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్ గుప్త హోంమంత్రి కావడంతో, బర్ధన్ ప్రధాన కార్యదర్శి అయ్యారని, 2012 మార్చి వరకూ ఆయన ఆ పదవిలోనే కొనసాగారని, ఆ తర్వాత పార్టీ శ్రేణులకు ఆయన తన విలువైన సూచనలిస్తూ పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా పనిచేశారని తెలిపారు. కాంగ్రెస్తో సహా భాజపాయేతర పక్షాలను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో విశేషంగా కృషి చేసిన బర్ధన్ గొప్ప రాజనీతి గల నాయకుడని అయన ఆశయాలకు కమ్యూనిస్టులు కృషి చేసినప్పుడే అయనకు నిజమైన నివాళులని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి బేగం, జి వేళంగిణిరావు, బి కేశవయ్య, ఎస్ కె సల్మ, కె జగ్గస్వామి, ఎన్ అప్పారావు, కాళిషా, ఎన్ త్రినాద్, డి సతీష్, పి రమణ, కె రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

