ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీసులు, ఈగిల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. బుధవారం రాత్రి ఖమ్మం బైపాస్ రోడ్డులోని తిరుమల రోలింగ్ షట్టర్ ఇంజనీరింగ్ వర్క్స్ వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పదంగా వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో సుమారు రూ.56 లక్షల విలువైన 113 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, అద్దెకు తీసుకున్న రెండు వాహనాల డిక్కీ, డ్యాష్బోర్డుల్లో రహస్యంగా దాచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఈగిల్ టీమ్ సీఐ విజయ్, టూ టౌన్ ఎస్ఐ వి. రమేష్తో పాటు పోలీసు, ఈగిల్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.

