ఆత్మకూరు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగతనం కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి రూ.12.85 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. జేఆర్ పేటలో నివసిస్తున్న వృద్ధ దంపతుల ఇంట్లో ఈ చోరీ జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. విజ్ఞానపు వీర్రాజు ఆరు నెలల క్రితం వృద్ధ దంపతులకు సహాయకుడిగా పనిలో చేరాడు. వారి ఇంట్లో పనిచేస్తున్న అతడు అదును చూసుకుని 11 సవర్ల బంగారు నగలు, రూ.1,80,500 నగదును చోరీ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి సమాచారం మేరకు రెండు ప్రాంతాల్లో దాచిన బంగారు నగలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ గంగాధర్, ఎస్సై జంపానీ కుమార్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ కేశవ్ తదితరులు కేసును ఛేదించారు. సిబ్బందిని ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించి రివార్డు ప్రకటించారు. సహాయకులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు.


