ఖైదీలతో ముఖాముఖి.. వసతులు, పరిశుభ్రతపై ఆరా.. మౌలిక సదుపాయాల మెరుగుదలకు అధికారులకు సూచనలు
ఆత్మకూరు, జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
నెల్లూరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ గురువారం ఆత్మకూరు సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమెతో పాటు ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి వి. గాయత్రి కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రత, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.తనిఖీలో భాగంగా జడ్జి ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జైలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఎవరైనా వేధింపులకు గురిచేస్తున్నారా, భోజనం నాణ్యత ఎలా ఉంది, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. ఖైదీలకు చట్టపరమైన సహాయం అవసరమైతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉంటుందని కూడా వివరించారు.
అనంతరం జైలు వంటశాల, నిల్వ గదులు, ఖైదీల బ్యారక్‌లు, బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వంటశాలలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని జైలు అధికారులకు సూచించారు.ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, జైలు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఆరోగ్య భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఖైదీల హక్కులను పరిరక్షిస్తూ మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.ఈ తనిఖీ సందర్భంగా అడ్వకేట్ ఎన్. ఓబులేసు, లోక్ అదాలత్ సభ్యుడు ఎం. సుబ్బారెడ్డి, జైలు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


