ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి: డా. ఈడా శేషగిరిరావు
కూసుమంచి, సెప్టెంబర్ 29: తెలంగాణలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఆధార్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఈడా శేషగిరిరావు పిలుపునిచ్చారు. మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్హాల్లో సయ్యద్ జమీల్ అధ్యక్షతన నిర్వహించిన పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర బలహీన వర్గాల అభివృద్ధికి కేటాయించే నిధులు పూర్తిస్థాయిలో వారి సంక్షేమానికే వినియోగించేలా కృషి చేయాలన్నారు.
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో ఆధార్ పార్టీని ప్రజా సమస్యలపై పోరాడే బలమైన వేదికగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయనున్నట్లు శేషగిరిరావు వెల్లడించారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంబోజి బుడ్డయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బండ రాజారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్గౌడ్, పఠాన్ కరిష్మా, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోడేటి దుర్గాప్రసాద్, చేరికల కమిటీ చైర్మన్ గుణగంటి శ్రీనివాస్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కుక్కల నాగేశ్వరావుగౌడ్తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


