ఆత్మకూరులో వివిధ శాఖల అధికారులతో సమీక్ష – సాగునీటి, తాగునీటి, మున్సిపల్ అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు
ఆత్మకూరు, మే 22 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పనితీరు విషయంలో నెల్లూరు జిల్లా ముందువరుసలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి ఆనం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పనితీరును ప్రశంసించడం ప్రతి అధికారికి గర్వకారణమన్నారు. సీఎం స్ఫూర్తితో జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.
సాగునీటి అంశాలపై సోమశిల, తెలుగు గంగ, నీటి పారుదల శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కాలువల మరమ్మత్తులు, కొనసాగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ముందే సాగునీటి పనులు పూర్తి చేసి రైతులకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సైక్లోన్ రిలీఫ్, ఎఫ్‌డీఆర్ గ్రాంట్ల కింద మంజూరైన పనులను వేగవంతం చేయాలని సూచించారు.సోమశిల ఉత్తర, దక్షిణ కాలువల పనుల్లో ఉన్న ఇబ్బందులను సమీక్షించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మైనర్, మీడియం ఇరిగేషన్ కింద రూ.3212 కోట్ల వ్యయంతో 440 పనులు మంజూరయ్యాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.త్రాగునీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ కింద రూ.6588 కోట్లతో 336 పనులు అమలులో ఉన్నాయని తెలిపారు. వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సీపీడబ్ల్యూఎస్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాల స్కీములను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆదేశించారు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.36 కోట్లతో రహదారులు, డ్రైన్లు, అమృత్ పథకం కింద రక్షిత మంచినీటి పథకాల పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి అధికారులు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 23 వార్డులు ఉన్న మున్సిపాలిటీని 28 వార్డులుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.


