. రామాపురం పల్లె పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఐదు రోజుల అహర్నిశల శ్రమకు సీఎం, డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఆత్మకూరు, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం వద్ద నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా ముగియడంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ప్రత్యేకంగా నిలిచింది. భారీగా తరలివచ్చిన సుమారు లక్ష మంది ప్రజల మధ్య సభ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సాగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.ఈ విజయానికి ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించిన అధికారుల సమష్టి కృషి ప్రధాన కారణంగా నిలిచింది. సభా వేదిక, ప్రజల రాకపోకలు, ట్రాఫిక్, భద్రత, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, విద్యుత్ తదితర ఏర్పాట్లపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ శాఖల మధ్య సమన్వయం సాధించారు.జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాటి, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఆత్మకూరు ఆర్డీవో బి.పావని, జిల్లా డ్వామా పీడీ శ్రీనివాసరావు తదితరులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రింబవళ్లు అధికారులు, సిబ్బందితో సమన్వయం చేస్తూ సభ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు.భారీ జనసమీకరణ ఉన్నప్పటికీ ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ముందస్తు వ్యూహంతో వ్యవహరించడం, అన్ని శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.సీఎం, డిప్యూటీ సీఎంల ప్రశంసలు అందుకున్న ఈ అధికారుల బృందం కృషిని జిల్లా ప్రజల తరఫున కూడా అభినందించాల్సిన అవసరం ఉంది.


