వార్త ముఖ్యాంశాలు
- తాళ్లపూడి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల వినతి తాళ్లపూడి, ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి): రేషన్ బస్తాలకు నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం వల్ల తీవ్ర పనిభారం, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంక్షేమ…
- ఇందులో భాగంగా శుక్రవారం తాళ్లపూడి మండలానికి చెందిన రేషన్ డీలర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
- ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి పంపిణీ చేయనున్న 10 శాతం బ్రోకెన్ రైస్ బస్తాలకు క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల అదనపు భారం పడుతోందని తెలిపారు.
తాళ్లపూడి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల వినతి
తాళ్లపూడి, ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి): రేషన్ బస్తాలకు నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం వల్ల తీవ్ర పనిభారం, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం తాళ్లపూడి మండలానికి చెందిన రేషన్ డీలర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి పంపిణీ చేయనున్న 10 శాతం బ్రోకెన్ రైస్ బస్తాలకు క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. మండల స్టాక్ పాయింట్ నుంచి బస్తాలు దిగుమతి చేసుకునే సమయంలో ఒకసారి, లబ్ధిదారులకు ఈ-పాస్ ద్వారా పంపిణీ చేసే సమయంలో మరోసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి రావడంతో సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా పలువురు డీలర్ల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం, సంబంధిత యాప్ డౌన్లోడ్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మండల స్టాక్ పాయింట్ల వద్ద క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయకుండా, ఆ భారాన్ని కేవలం రేషన్ డీలర్లపైనే మోపడం సమంజసం కాదన్నారు.
ఇప్పటికే స్టాక్ పాయింట్లలో జరుగుతున్న అవకతవకల కారణంగా ఒక్కో డీలర్ నెలకు 100 నుంచి 300 కిలోల వరకు నష్టపోతున్నారని వారు ఆరోపించారు. ప్రతి బస్తాను 50 కిలోలుగా నిర్ధారించి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయించడం వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని డీలర్లతోనే అధికారికంగా భరింపజేసినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని పూర్తిగా సమీక్షించి, రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 మంది రేషన్ డీలర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.