Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

రీసర్వేకు బ్రేక్.. సమస్యలు పరిష్కరించే వరకు విధుల బహిష్కరణ!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రీసర్వేకు బ్రేక్.. సమస్యలు పరిష్కరించే వరకు విధుల బహిష్కరణ!

వార్త ముఖ్యాంశాలు

  • సమస్యలు పరిష్కరించే వరకు రీసర్వే విధుల బహిష్కరణ!
  • మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా లైసెన్స్ సర్వేయర్ల ఆందోళన – పెండింగ్ బిల్లులు చెల్లించాలి, గౌరవ వేతనం కల్పించాలి మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న లైసెన్స్ సర్వేయర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా…
  • దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

సమస్యలు పరిష్కరించే వరకు రీసర్వే విధుల బహిష్కరణ!

మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా లైసెన్స్ సర్వేయర్ల ఆందోళన – పెండింగ్ బిల్లులు చెల్లించాలి, గౌరవ వేతనం కల్పించాలి

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న లైసెన్స్ సర్వేయర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రీసర్వే విధులను బహిష్కరించారు. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లా లైసెన్స్ సర్వేయర్ల అధ్యక్షుడు బండారు వెంకన్న ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్ పరిధిలోని లైసెన్స్ సర్వేయర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి తమ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ సర్వేయర్లు ఐక్యంగా రీసర్వే విధుల బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారు.

11 నెలలుగా ఎదురుచూపులే.. రూ.5 వేల నామమాత్రపు పారితోషికమే!

లైసెన్స్ సర్వేయర్లు మండలాల్లో విధుల్లో చేరి సుమారు 11 నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే రూ.5,000 నామమాత్రపు పారితోషికం చెల్లించి మిగతా సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల సర్వేయర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తిచేసి తదుపరి గ్రామాల్లో కూడా పనులు పూర్తి చేసే దశకు చేరుకున్నప్పటికీ, గతంలో పూర్తిచేసిన పనులకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడం ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతోందని తెలిపారు.

క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి విధులు:

రీసర్వే పనుల్లో భాగంగా పాములు, విషపూరిత కీటకాలు సంచరించే ప్రాంతాలు, బురద పొలాలు, ముళ్ల కంపలు, చెట్ల పొదల్లో సైతం సర్వే పనులు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ తగిన భద్రతా సౌకర్యాలు, ప్రమాద బీమా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లేందుకు పెట్రోల్ ఖర్చులు, భోజనం, టిఫిన్, ఇతర రోజువారీ ఖర్చులు సైతం సర్వేయర్లే భరించాల్సి వస్తోందన్నారు.

అదనపు పనులకు కూడా పారితోషికం ఇవ్వాలి:

గ్రామ సరిహద్దుల నిర్ధారణ (విలేజ్ బౌండరీ), ప్రభుత్వ భూముల సర్వే వంటి అదనపు పనులు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి ప్రత్యేక పారితోషికం చెల్లించే విధానం లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సర్వేయర్ల శ్రమను గుర్తించి అన్ని రకాల సర్వే పనులకు తగిన గౌరవ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

డిమాండ్:

ఈ సందర్భంగా జిల్లా లైసెన్స్ సర్వేయర్ల అధ్యక్షుడు బండారు వెంకన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ భూ రీసర్వే కార్యక్రమం విజయవంతం కావడానికి లైసెన్స్ సర్వేయర్లు ఎంతో కష్టపడుతున్నారని, ఎండ, వానలను లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని, లైసెన్స్ సర్వేయర్లకు నెలవారీ గౌరవ వేతనం కల్పించాలని, ప్రయాణ ఖర్చులు, క్షేత్రస్థాయి ఖర్చులు చెల్లించాలని, ప్రమాద బీమా, భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూముల సర్వే వంటి అదనపు పనులకు కూడా ప్రత్యేక పారితోషికం నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

తమ సమస్యలను ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించని పక్షంలో సమస్యలు పరిష్కారమయ్యే వరకు విధుల బహిష్కరణ కొనసాగిస్తామని బండారు వెంకన్న స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా పరిధిలోని లైసెన్స్ సర్వేయర్లకు పిలుపునిచ్చారు.

లైసెన్స్ సర్వేయర్ల నినాదం:

ఉచిత సేవలు వద్దు – గౌరవ వేతనం ముద్దు!

సర్వేయర్ల శ్రమకు గుర్తింపు – వృత్తికి గౌరవం!

పున్నమి రిపోర్టర్ | భూక్య రాము నాయక్
మహబూబాబాద్ జిల్లా

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *