నూతన మేయర్ ముక్కా శ్రావణికి తండ్రి దూరం.. మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు కన్నుమూత
విశాఖపట్నం, నవంబర్ 20 (పున్నమి ప్రతినిధి):
విశాఖ నగర నూతన మేయర్ ముక్కా శ్రావణి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.
తెల్లవారుజామున ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
కుమార్తె నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసి, ఉన్నత పదవిలో బాధ్యతలు చేపట్టే సందర్భాన్ని చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. అయితే ఆ ఆనందకరమైన ఘట్టానికి ముందే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఒకవైపు కుమార్తెకు మేయర్ పదవి దక్కిన ఆనందం, మరోవైపు తండ్రి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ముక్కా ముత్యాల నాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, బంధువులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


