పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 25)
వేముల: వేముల మండలంలోని స్థానిక శ్రీశక్తి భవన్ నందు మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక మహిళలతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెలుగు–డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలు వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని, అర్హతను బట్టి 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని తెలిపారు.
అదేవిధంగా PMFME పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మహిళా సంఘాల సభ్యులు ముందుకు రావాలని సూచించారు. ఈ యూనిట్లకు అవసరమైన రుణ సదుపాయాలను శ్రీనిధి కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని, ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ జైపాల్, గ్రామ సమాఖ్య అసిస్టెంట్ పుల్లయ్య, ఎంటీ గౌరీ తదితరులు పాల్గొన్నారు.



