గణేష్ ఉత్సవాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు
ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖశాంతులతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని శనివారం ఒక ప్రకటన ద్వారా ఆత్మకూరు తహశీల్దారు పద్మజాకుమారి తెలిపారు . పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ప్లాస్టిక్, రసాయన రంగులు లేని ప్రతిమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా నీటి వనరులు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
వినాయక ప్రతిమల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలకు పోలీసు, విద్యుత్ శాఖలతో పాటు సంబంధిత గ్రామ పంచాయతీల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేసి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అధికారులు సూచించిన నిబంధనలను ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించి సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దారు హెచ్చరించారు.


