అక్టోబర్ 06,పున్నమి ప్రతినిధి నిర్మల్
ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వ్యవసాయ సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారిగా పూర్తి చేయాల్సిన ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే, ఇప్పటి వరకు పూర్తయిన ప్రక్రియ, ఇంకనూ పూర్తి చేయాల్సిన ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలోనే డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. వాలంటీర్లు అందరూ డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షణ ఉంచాలని పేర్కొన్నారు. పంటల కోతల సమయానికి మునుపే డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.
రాబోయే రబీ పంట కాలంలో రైతులు పంట మార్పిడి విధానాలు విస్తృతంగా పాటించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుతో మాట్లాడి పంట మార్పిడి విధానాల ఆవశ్యకతను వివరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, మండల వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
