విశాఖపట్నం, అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి):
విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు.
నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, డీసీపీ లతా మాధురి, ఏడీసీపీ ఎన్. రమ్య ఆదేశాల మేరకు ఏసీపీ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నారాయణ స్కూల్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు దేశభక్తి, జాతీయ సమైక్యత, పోలీసుల సేవలను ప్రతిబింబించే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు కలిసి అమరవీరుల స్మారక ర్యాలీ నిర్వహించారు. బలిమెల ఘటనలో వీరమరణం పొందిన 38 మంది గ్రేహౌండ్స్ కమాండోలతో పాటు ఇతర పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకట్రావు మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలను, అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు, ఎస్‌ఐలు హరికృష్ణ, సత్తిబాబు, సాంబశివరావు, పెందుర్తి ఎస్‌ఐ సూరిబాబు, ఇతర పోలీస్ అధికారులు, పాఠశాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.





